18, జులై 2013, గురువారం

న్యాయ వ్యవస్థకీ దుర్గతి


 అవినీతి కోరల్లో న్యాయ వ్యవస్థ
 
 
 
అవినీతి అంతుచూడాల్సిన న్యాయ వ్యవస్థనే అవినీతి కోరల్లో చిక్కుకుపోతోంది. ఈ వ్యవస్థలో ఉన్న కొంత మంది అవినీతిపరుల కారణంగా యావత్ న్యాయవ్యవస్థపైనే అపనమ్మకం పెరిగిపోతోంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం... దేశంలో న్యాయవ్యవస్థలో అవినీతి పెచ్చుమీరిపోతోంది. దీని ఫలితంగా కేసుల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటోంది. న్యాయమూర్తుల కొరత కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు. వివిధ ప్రొసీజర్లలో సంక్లిష్టత కారణంగా కూడా ఈ అవినీతి అధికమైపోతోంది. దిగువ కోర్టుల్లో అవినీతి కొంతవరకు సాధారణమైపోయి నప్పటికీ, ఈ జాడ్యం అత్యున్నత న్యాయస్థానానికి సైతం చేరడం అందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. ఏటా జూలై 17ను అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

దేశంలోని వివిధ రాజ్యాంగ వ్యవస్థల్లో న్యాయవ్యవస్థను సర్వోన్నతమైందిగా భావిస్తాం. పలు సందర్భాల్లో పార్ల మెంటు కంటే కూడా సుప్రీం కోర్టునే ప్రజలు నమ్ముకున్న సందర్భాలున్నాయి. అలాంటి న్యాయవ్యవస్థపైనే ఇప్పుడు అపనమ్మకం మొదలైంది. గత ఏడాది జరిగిన 'బెయిల్ ఫర్ మనీ' లాంటి ఉదంతాలు న్యాయవ్యవస్థపై సామాన్యుడి నమ్మకాన్ని తునాతునకలు చేస్తున్నాయి. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిగేది అన్యాయమే అన్న భావన ప్రజల్లో స్థిరపడకముందే ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి న అవసరం ఉంది.

2011లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయుడిగా మన్ననలు పొందిన జె.ఎస్ వర్మ కూడా న్యాయవ్యవస్థలో అవినీతిపై ఆందోళన వ్యక్తం చేశారు. "సందేహాస్పదమైన వ్యక్తిత్వం కలవారు సైతం ఉన్నత న్యాయవ్యవస్థలోకి చొరబడ్డారు'' అని ఆయన వ్యాఖ్యానిం చారు. జస్టిస్ పూంచి ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. న్యాయమూర్తి పూంచిని అభిశంసించాలని 'క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ' అప్పట్లో ఉద్యమించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు అప్పట్లో తాను సుముఖత వ్యక్తం చేసి నప్పటికీ, రాజకీయపరమైన జోక్యంతో అది కార్య రూపం లోకి రాలేకపో యిందన్నారు. "ఆ ఆరోపణలు గనుక రుజు వైతే, అదెంతో తీవ్రమైన అంశమవుతుంది. అందుకే వాటిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. విచారణ జరిగితేనే అవి నిజమో, అబద్దమో తేలుతుంది'' అని ఆయ న వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకానికి ఆయన పేరు కూడా పరిశీలనకు వచ్చిందని కూడా వర్మ తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా అప్పట్లో, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి బాలకృష్ణన్‌ను కొనసాగించడాన్ని కూడా జస్టిస్ వర్మ తప్పుబట్టారు. "ఆయన గనుక ఆ పదవిలో నుంచి స్వచ్ఛం దంగా వైదొలగని పక్షంలో బలవంతంగానైనా దింపేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి'' అని అభిప్రాయపడ్డారు.

సుప్రీం కోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త, న్యాయవ్యవస్థ జవాబుదారీ తనానికి కృషి చేస్తున్న ప్రశాంత్ భూషణ్ గత 16 లేదా 17 మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులు అని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై ఆయనకు కోర్టు నోటీసులు కూడా అందాయి. దీనికి స్పం దిస్తూ 2009 డిసెంబర్‌లో ఆయన ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడ్డారు. న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కూడా ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలను సమర్థించారు. 'ఈ విషయంలో క్షమా పణలు చెప్పే ప్రసక్తి లేదు. అవసరమైతే జైలుకైనా వెళ్తా'నని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బహిరంగంగా చర్చ జరగకపోతే న్యాయవ్యవస్థ తనపై వచ్చిన ఆరోపణల నుంచి విముక్తి పొందదు అని కూడా స్పష్టం చేశారు.

జనం కోసం జస్టిస్...
ఏ దేశంలోనైనా న్యాయవ్యవస్థ ప్రజల హక్కులకు రక్షణ కల్పించేదిగా ఉండాలి. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రజల హక్కులపై జరిగే దాడి నుంచి న్యాయస్థానాలు ప్రజలను రక్షించాలి. అలా చేయగలిగిన నాడే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. న్యాయమూర్తులు గనుక సమగ్రత లేనివారైతే, సరైన నైతిక ప్రవర్తన లేనివారైతే ఇక ప్రజలు ఎవరిని నమ్ముకోవాలి? దురదృష్టవశాత్తు నేడు దేశంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. న్యాయవ్యవస్థలో కొందరు తమ అవినీతి కారణంగా యావత్ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకువస్తున్నారు.

ఒకప్పుడు కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి న్యాయమూర్తుల కొరత, ఆ వ్యవస్థ లో సిబ్బంది కొరత అని మాత్రమే భావించేవారు. తాజాగా ఈ జాప్యానికి మరో కొ త్త కారణం కూడా తోడైంది. కొంతమంది న్యాయమూర్తు లు కావాలనే కేసుల పరిష్కారంలో జాప్యానికి పాల్పడు తు న్నారని, తద్వారా తమ ఆదాయం పెంచుకుంటున్నారన్న ఆ రోపణలూ వినవస్తున్నాయి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

స్వతంత్ర ప్రతిపత్తి...
న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు రాజ్యాంగంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయంలో ఆర్టికల్ 124 న్యాయవ్యవస్థకు అండగా నిలుస్తుంది. ఉన్నతస్థాయిలో న్యాయమూర్తి పదవీకాలంలో ఆయనకు హాని కలిగించే విధంగా జీతభత్యాలను తగ్గించేందుకు, ఇతర సర్వీస్ కండిషన్స్ మార్చేందుకు వీల్లేదు. విధి నిర్వహణ నుంచి తొలగించే వీలులేదు. అలా తొలగించాల్సి వస్తే పార్లమెంట్ అభిశంసన ప్రక్రియ పూర్తి కావాల్సిందే. ఇదేమీ అంత తేలికైన వ్యవహారం కాదు. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ విధ మైన అభిశంసన అత్యంత అరుదుగా మాత్రమే జరగ గలదు. అంతమాత్రాన ఈ విధమైన స్వతంత్ర ప్రతిపత్తి న్యాయమూర్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు వీలు కల్పించిందని భావించనక్కర్లేదు.

న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ పరమైన జోక్యం పెరగడంతోనే ఈ వ్యవస్థలో అవినీతికి బీజాలు పడినట్లుగా భావించవచ్చు. ఈ నియామకాల్లో లాబీయింగ్ పెరిగిపోయింది.

న్యాయవ్యవస్థ గనుక నిజమైన స్ఫూర్తితో పనిచేస్తే ప్రజలకు మరెంతో న్యాయం జరుగుతుందనడంలో సందేహం లేదు. నియామకాలు, బదిలీలు లాంటి అంశాల్లో భారత ప్రధాన న్యాయమూర్తికి మరిన్ని అధికారాలను ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న వ్యక్తిని ఆయా అంశాల్లో సంప్రదింపులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.

కొందరు న్యాయమూర్తుల సుసంపన్న జీవనశైలి ఆందోళన కలిగించేదిగా మారింది. ఇలాంటి వాటి పరిష్కారానికి న్యాయవ్యవస్థ లోనే అంతర్గతంగా ఒక 'బోర్డ్ ఆఫ్ జ్యుడిషియల్ ఎథిక్స్'ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది.

అవినీతికి ఇవీ కారణాలే!
1. సాధారణ ప్రజానీకానికి అందుబాటులో లేకపోవడం: ప్రస్తుత న్యాయవ్యవస్థ సగటు మనిషికి అందుబాటులో లేకపోయింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే అది ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.
2. అధికార దుర్వినియోగం: మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లు కొంతమంది బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేయడం లో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఒకరు రూ. 40,000 లంచం తీసుకొని సాక్షాత్తూ భారత రాష్ట్రపతి పైనే బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేశారు. మరికొన్ని సం దర్భాల్లో కొంతమంది న్యాయమూర్తులు వాది / ప్రతివాది నుంచి వ్యక్తిగత సహాయాలు కోరుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. రాజస్థాన్‌లో ఓ న్యాయమూర్తి 'లైంగిక' ప్రతిఫలం కోరినట్లు కూడా వార్తలొచ్చాయి. కోర్టు ధిక్కారం కింద శిక్ష పడుతుందేమోనన్న భయం కూడా న్యాయవ్యవస్థలో అవినీతి గుట్టు రట్టు కాకుండా పోయేందుకు కొంత వరకు కారణమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో కనీసం ఓ అంతర్గత వ్యవస్థ ఉండి, అక్కడ బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసుకునే అవకాశం, విచారణ నిష్పక్షపాతంగా జరిగే వీలు ఉండాలి.

3. అభిశంసన ప్రక్రియను సరళం చేయాలి: ప్రస్తుత నిబంధనల ప్రకారం అభిశంసన ప్రక్రియ పూర్తి కానిదే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవిలో నుంచి తొలగించే వీల్లేదు. ఈ ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా మారింది. జస్టిస్ వి.రామస్వామి ఉదంతం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

లంచాలు ఎందుకిస్తారంటే....
1. అనుకూలమైన తీర్పు కోసం.
2. తీర్పు వేగంగా వచ్చేందుకు.
3. బెయిల్ పొందేందుకు.
4. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు.

అవినీతిని తగ్గించాలంటే...
1. టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలి: టెక్నాలజీ వినియోగం ద్వారా దిగువ కోర్టుల్లో అవినీతిని చాలావరకు తగ్గించే వీలుంది. పై కోర్టులు దిగువ కోర్టుల పనితీరును సమీక్షించడం తేలికవు తుంది. సాధారణ మనిషికి అర్థమయ్యేలా న్యాయసంబంధిత వెబ్‌సైట్లు, సీడీలు అందుబాటులోకి తేవాలి. కోర్టు ఫైళ్ళను కంప్యూటరీకరిం చాలి. కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో రికార్డులు నిర్వహించాలి.

2. ప్రత్యామ్నాయ, ప్రత్యేక కోర్టులు: కోర్టులపై భారం తగ్గేందుకు ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలి. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి.
3. జవాబుదారీతనం పెంచడం: జడ్జీలను జ్యుడీషియల్ రివ్యూ పరిధిలోకి తేవాలి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏర్పరచు కోవాలి. అవినీతికి వ్యతిరేకంగా బార్ అసోసియేషన్స్ కృషి చేయాలి. న్యాయవ్యవస్థపై అంతర్గత లేదా బహిర్గత నిఘా వ్యవస్థ ఏర్పరచాలి. న్యాయ మూర్తులు, వారి కుటుంబ సభ్యులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలి.

అవినీతి ఉందంతాలెన్నెన్నో...
స్వతంత్ర భారతదేశంలో న్యాయవ్యవస్థలో అవినీతి చోటుచేసుకున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

వాటినొకసారి పరిశీలిస్తే...
1949: జస్టిస్ సిన్హాపై అభిశంసన - న్యాయపరమైన విధులను తగినవిధంగా నిర్వహించకపోవడం, తద్వారా న్యాయపాలనా యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం అందుకు కారణాలుగా పేర్కొన్నారు. ఈవిధమైన చర్యలు / ప్రవర్తనను 1971 నుంచి కూడా న్యాయ ధిక్కార క్రిమినల్ చర్యల పరిధిలోకి తీసుకువచ్చారు.

1971: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.వీరాస్వామి (జస్టిస్ వి.రామస్వామి మామ) స్థాయికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సీబీఐని అనుమతించారు.
1991-1993: సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామిపై పలు ఆరోపణలు వచ్చాయి. మూడు, నాలుగు ఆరోపణలపై సుప్రీంకోర్టు కూడా ఆయనను తప్పు బట్టింది. తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా పార్లమెంట్‌కు సూచించింది. ఆయనను అభిశంసించడంలో పార్లమెంట్ విఫలమైంది.
1995: ఎ.ఎం. భట్టాచార్జీ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న ఒక ప్రచురణ సంస్థ నుంచి ఒక పుస్తకరచనపై రూ. 70 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను రాజీనామా చేయించారు.

1996: అజిత్ సేన్ గుప్తా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ముంబయి అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న స్మగ్లర్లకు చెందిన కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ అభ్యర్థనలపై ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు, మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయడం ఆయనకు ఆనవాయితీ. రిటైర్ అయిన తరువాత, ఫెరా ఉల్లంఘనల కింద 1996లో ఆయనను అరెస్టు చేశారు.

1994-97: ఎ.ఎం. అహ్మది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో (అక్టోబర్ 1994 - మార్చి 1997) ఆయన కుమార్తె ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ఉండేవారు. కొంతమంది న్యాయమూర్తులు ఆమెను 'ప్రత్యేకం'గా చూడడం ఇతర న్యాయవాదులకు ఇబ్బంది కలిగించింది. న్యాయమూర్తుల బంధువులు ఆయా న్యాయమూర్తుల కోర్టుల్లో కేసులు వాదించకూడదని ఓ తీర్మానం పెట్టేందుకు బార్ సభ్యులు ప్రయత్నించారు. అది వీగిపోయింది.

2000: ఎ.ఎస్. ఆనంద్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఒక కేసులో తన భార్య, అత్తలకు అను కూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఆయన తన హోదాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆయన పుట్టినతేదీ నమోదుపై కూడా వివాదం రేగింది. దీనిపై సీబీఐ విచారణ కూడా జరిగింది. రామ్‌జెఠ్మలానీ తన పుస్తకం 'బిగ్ ఇగోస్, స్మాల్ మెన్'లో ఈ తరహా ఉదంతాలు అనేకం ప్రస్తావించారు.
సెక్స్ ఫర్ అక్విటాల్: తనకు అనుకూలంగా ఓ కేసులో తీర్పు ఇచ్చేందుకు గాను రాజస్థాన్ హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ 'లైంగిక' ప్రతిఫలం కోరినట్లు జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్ సునీత మాలవీయ ఆరోపించారు. జస్టిస్ అరుణ్ మదన్‌కు కూడా ఈ విధమైన ప్రతిఫలం అందించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు ఆ కమిటీ భావించింది. ఆ న్యాయమూర్తి ఇక ఆ తరువాత న్యాయస్థానం ముఖం చూడలేదు. రాజీనామా చేశారు.

క్యాష్ ఫర్ జాబ్: పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో తమ కుమార్తెలకు, బంధువులకు అధికంగా మార్కులు వేయించుకోదలిచారు.
ఆ ముగ్గురు న్యాయమూర్తులు ఎం.ఎల్ సింగ్, మెహతాబ్ సింగ్ గిల్ , అమర్‌బీర్‌సింగ్. ఈ ఉదంతంపై విచారణకు రెండు విచారణ సంఘాలు ఏర్పాటయ్యాయి. గిల్, అమర్‌బీర్ సింగ్ రాజీనామా చేసినా, ఎం.ఎల్ సింగ్ మాత్రం పదవిలో కొనసాగారు. ఆయనకు మాత్రం ఏ కేసునూ విచారణకు అప్పగించలేదు. ఏ పనీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు.

2002-03: ఈ ఉదంతం మైసూర్ సెక్స్ స్కాండల్‌గా పేరొందింది. కర్ణాటక హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ఓ రిసార్ట్‌లో ఇతరత్రా పరిస్థితుల్లో పోలీసుల కంటబడ్డారు. వారిపై పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. దీనిపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ వారికి క్లీన్‌చిట్ ఇచ్చింది.

ఏడు పాపాలతో పెనుముప్పు
2011 నవంబర్‌లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రుమా పాల్ అత్యున్నత న్యాయ వ్యవస్థపై చురకలు వేశారు. అక్కడ 7 రకాల పాపాలు చోటు చేసుకుంటు న్నట్లుగా వ్యాఖ్యానించారు. అవేంటో చూస్తే...
1. సహచర న్యాయమూర్తి 'అన్యాయ' ధోరణిపట్ల కళ్ళు మూసుకోవడం.
2. హిపోక్రసీ - న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించడం.
3. గోప్యత - హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూ ర్తుల నియామకంలో అవసరానికి మించిన గోప్యత పాటించడం.
4. ప్లాగియరిజం, ప్రొలిక్సిటీ - తరచూ న్యాయ మూర్తు లెందరో పూర్వంలో వేరే వారు ఇచ్చిన తీర్పుల్లోంచి పేరాలకు పేరాలు వారి పేరు ప్రస్తావించకుండానే తమ తీర్పుల్లో పేర్కొనడం.
5. సెల్ఫ్ ఆరోగన్స్ - ఇతరులపై తమకే ఆధిక్యం ఉందని భావించడం, తమ క్రమశిక్షణారాహి త్యానికి న్యాయవ్యవస్థ 'స్వతంత్రత' ముసుగు వేయడం.
6. ప్రొఫెషనల్ ఆరోగన్స్ - సరైన విధంగా కేసుల ను పరిశీలించకుండానే తొందరపాటుతో తీర్పు లు ఇవ్వడం, కీలక అంశాలు విస్మరించడం.
7. నెపోటిజం - బంధుప్రీతి, ఇతరత్రా సహాయాలు కోరడం.

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఎలా ఏర్పడిందంటే
రెండో ప్రపంచ యుద్ధం తరువాత నాజీ యుద్ధ నేరాలపై దర్యాప్తు జరిపిన ఒక పరిశోధకుడు, న్యూరెంబర్గ్‌లో అమెరికా అధికారిక యంత్రాంగం జరిపిన పన్నెండు సైనిక విచారణల్లో ఒకటైన ఐన్‌శాట్జ్‌గ్రూపెన్ విచారణలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆర్మీ ప్రధాన న్యాయవాదిగా వ్యవహరించిన బెంజమిన్ బి. ఫెరెంజ్... ఒక అంతర్జా తీయ చట్ట పాలన, ఒక అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం ఏర్పాటుకు ప్రధాన మద్దతుదారుగా మారారు. 1975లో ప్రచురించిన 'డిఫైనింగ్ ఇంటర్నేషనల్ అగ్రెషన్ - ది సెర్చ్ ఫర్ వరల్డ్ పీస్' అనే తన మొదటి పుస్తకంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు కోసం వాదించారు.
ఎ.ఎన్.ఆర్. రాబిన్‌సన్, ట్రినిడాడ్, టొబాగో ప్రధాన మంత్రి అక్రమ మాదకద్రవ్య వ్యాపారాన్ని నిరోధించేందు కు ఒక శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సృష్టించా లని ప్రతిపాదించడంతో, 1989లో ఈ ఆలోచన పునరు జ్జీవనం పొందింది. శాసనం ముసాయిదాను తయారు చేసేందుకు పని ప్రారంభమవగా, అంతర్జాతీయ సమా జం...మాజీ యుగోస్లావియా, రువాండాల్లో యుద్ధ నేరా లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది, దీంతో ఒక శాశ్వత అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం ఏర్పాటు అవసరం మరింత ప్రాధాన్యత పొందింది.

తరువాతి సంవత్సరాల్లో దీనిపై చర్చలు జరిగాయి, ఒక ఒప్పందాన్ని ఖరారు చేసే లక్ష్యంతో సాధారణ సభ జూన్ 1998లో రోమ్ నగరంలో ఒక సదస్సును ఏర్పాటు చేసిం ది. జులై 17, 1998న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం రోమ్ శాసనం, 120 - 7 ఓట్ల తేడాతో ఆమోదిం చబడింది (ఇదే రోజున అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది). 21 దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడు దేశాలు చైనా, ఇరాక్, ఇజ్రాయెల్, లిబియా, ఖతర్, యునైటెడ్ స్టేట్స్, యెమెన్.

ఏప్రిల్ 11, 2002న రోమ్ శాసనం ఒక బంధన ఒప్పందంగా మారింది, ఈ సమయానికి దీనిని ఆమోదించిన దేశాల సంఖ్య 60 కి చేరుకుంది. శాసనం న్యాయబద్ధంగా జులై 1, 2002 నుంచి అమల్లోకి వచ్చింది. ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) కి ఈ రోజు తరువాత జరిగిన నేరాలపై మాత్రమే విచారణ జరిపే అధికారాన్ని కల్పించారు. 18 మంది న్యాయమూర్తులతో కూడిన మొదటి ధర్మాసనాన్ని సభ్యదేశాల సభలో ఫిబ్రవరి 2003లో ఎన్నుకోవడం జరిగింది. ఈ న్యాయమూర్తులు మార్చి 1, 2003న న్యాయస్థాన ప్రారంభ సెషన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయస్థానం తన మొదటి అరెస్ట్ వారెంట్‌ను జులై 8, 2005న జారీ చేసింది. మొదటి విచారణ - పూర్వ వాదనలు 2006లో జరిగాయి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి