28, జులై 2013, ఆదివారం

పవర్ గ్రిడ్

చాపకింద నీరులా పవర్ గ్రిడ్

శ్రీకాకుళం జిల్లాలో నిర్మించతలపెట్టిన థర్మల్‌, అణువిద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఒకపక్క ఉద్యమాలు సాగుతుంటే- మరోపక్క ఆ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ పంపిణీ కోసం చాటుమాటుగా పవర్‌గ్రిడ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది! ముఖ్యంగా సోంపేట, కాకరాపల్లిలో నిర్మించతలపెట్టిన మర్చంట్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ముఖ్యంగా టెక్కలి డివిజన్‌లో ఎపి జెన్‌కోతో పాటు, మరో మూడు ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. సోంపేట, కాకరాపల్లి ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నివేదిక తయారు చేయడం, కేంద్రం ఆమోదం చెప్పడంతో ప్రజా ఉద్యమాలు మొదలయ్యాయి. రెండుచోట్ల కాల్పుల వరకూ దారితీసింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిరసనోద్యమాల ఫలితంగా కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదనలకే పరిమితం చేసి మిన్నకుంది. సోంపేట, కాకరాపల్లి ప్రాజెక్టుల అనుమతుల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా పలాస వద్ద రామకృష్ణాపురం ప్రాంతంలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 765/400 కె.వి సామర్థ్యంగల గ్రిడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికీ సిద్ధమైంది. దీంతో పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి. అందులో గిరిజన గ్రామాలూ ఉన్నాయి.

అయితే, థర్మల్‌ ప్రాజెక్టుల వ్యతిరేక ఉద్యమాల్లో గ్రిడ్‌ ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాన్ని అనుసంధానం చేయలేదు. పవర్‌గ్రిడ్‌ ఏర్పాటుకు పునాది థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు. అలాంటి ప్రాజెక్టులే వద్దని ఉద్యమం సాగిస్తుంటే గ్రిడ్‌ ఏర్పాటు ఎక్కడవుతుందని నాయకులు భావించారు. అందువల్ల గ్రిడ్‌ వ్యతిరేక ఉద్యమం విస్తృతం కాలేదు. ప్రభుత్వానికి అదే బలాన్నిచ్చింది. అవసరమైన భూసేకరణకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యమం ఫలితంగా సోంపేట ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకున్నా, కాకరాపల్లి ఈస్టుకోస్టు కంపెనీ పనులు ప్రారంభించింది. ఉద్యమం, న్యాయస్థానాల వల్ల కొన్నేళ్లు ఆగినా, అనుమతులతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నేతలు చెరొక చేయి వేశారు. కంపెనీ యాజమాన్యం ద్వారా కొందరిని ప్రలోభాలకు గురిచేశారు. అయినా, ఉద్యమం నిలదొక్కుకొని పనుల నిలుపుదలకు ఆందోళన సాగిస్తోంది. అక్రమ కేసులు, పోలీసుల బలంతో పనులు పున:ప్రారంభమయ్యాయి.
రిలే దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మొదటిదశ పనులు పూర్తి చేసేందుకు కాకరాపల్లి ఈస్టుకోస్టు యాజమాన్యం సమాయత్తమవుతోంది. సోంపేట ప్రాజెక్టు విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం 2,440 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈస్టుకోస్టు కంపెనీ పనులు సాగుతుండడంతో గ్రిడ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వంపై కంపెనీ ఒత్తిడి పెంచింది. ప్రభుత్వ విధానాలు, ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టుల వైపు పరుగులు తీస్తుండడంతో గ్రిడ్‌ స్టేషన్‌ భూసేకరణకు సిద్ధమైంది. గ్రిడ్‌ ఏర్పాటుకు తొలి దశలో 134 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రామకృష్ణాపురం ప్రాంతంలో బతకుతెరువు కోసం ప్రభుత్వం నుంచి డీపట్టా భూములు పొందినవారే ఎక్కువగా ఉన్నారు. గ్రిడ్‌ కోసం 74 కుటుంబాల నుంచి డీ పట్టా భూములు 102.16 ఎకరాలను ప్రభుత్వం తిరిగి లాక్కోనుంది. మిగిలిన భూమిని రైతుల నుంచి లాక్కోవాల్సి ఉంది. ఈ విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభమై ఉత్పత్తిని చేస్తే గ్రిడ్‌ స్టేషన్‌ సామర్థ్యాన్ని పెంచాల్సొస్తుంది. అందుకు అదనపు భూమిని మళ్లీ సేకరించాల్సొస్తుంది. పేదలు, గిరిజనులు మళ్లీ భూములు కోల్పోవాల్సొస్తుంది. ప్రస్తుత భూసేకరణలోనే రామరాయి, గోపిటూరు గిరిజన గ్రామాల్లోని వంద కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. అయితే, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టింది. థర్మల్‌ ప్రాజెక్టుల ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని గ్రిడ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టినా తూర్పు గ్రిడ్‌తో దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానం చేయడానికే గ్రిడ్‌ ఏర్పాటని ప్రభుత్వం చెప్తోంది. ఈస్టుకోస్టు ప్రాజెక్టులో మొదటిదశలో ఉత్పత్తి అయ్యే 1,220 మెగావాట్ల విద్యుత్‌ను పలాస గ్రిడ్‌ ద్వారానే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. పవర్ గ్రిడ్ వలన కూడా పర్యావరణ సమస్యలు అపరిమితంగా వున్నాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి