18, జులై 2013, గురువారం

బడుగులకు దగా

 పేదలకు పదవులుండ కూడదా.....?


(జనవార్త- హైదరాబాద్)


 గ్రామాలే ప్రజాస్వామ్యా నికి పట్టుగొమ్మలు..అన్ని కులాలు మతాలు కలిసున్నదే సమాజం ..ఎస్సీ, ఎస్టీ ,బీసి... బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో పాలు పంచుకన్ననాడే నిజమైన సామా జిక న్యాయం జరిగినట్టవుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారంలో తగిన ప్రాతినిద్యం కల్పించేందుకు కృషి చేయాల్సిన వారే ఆ స్పూర్తికి తూట్లు పొడిచారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలే అందుకు తాజ నిదర్శనం. నిజమైన గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేయాలన్న లక్ష్యంతో నాటి ప్రధాని రాజీవ్‌గాంధి పంచాయతీరాజ్‌ స్ధానిక సంస్ధల్లో ఎస్సీ, ఎస్టీ ,బీసి బడుగు బలహీన వర్గాల కు రిజర్వేషన్లను ప్రవేశ పెట్టించారు. ప్రతి ఐదేళ్ళకొకసారి రొటేషన్‌ పద్దతిన అన్నిసామాజిక వర్గాలకు పాలనాధి కారంలో భాగస్వామ్యం దక్కేలే చట్టం తెచ్చారు.

అయితే చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే ప్రస్తుతం రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచింది. రాష్ట్రంలో రిజర్వేషన్‌ కేటగిరి పరిధిలోకి వచ్చే ఓటర్లే లేని చోట్ల ఆయా సామాజిక వర్గాలకు గ్రామపంచాయితీ పదవుల ను రిజర్వు చేసింది. ఆ విధంగా రిజర్వేషన్‌ కింద ప్రకటిం చి అధికారులు బడుగుల ప్రాతినిద్య కోటాకు తూట్లు పొడిచారు. రాష్ట్రంలో 34 గ్రామపంచాయతీలకు నామినే షన్‌ వేసే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులున్నప్పటికీ అగ్రవర్ణాల గ్రామాధికార పెత్తనం వారికి ఆ అవకాశం రానీయకుండా చేసిందంటున్నారు. గ్రామ సమస్యలను అడ్డంపెట్టి బడుగు బలహీన వర్గాలను ఎన్నికల నామి నేషన్లను దూరంగా ఉంచింది. స్థానిక సమస్యల సాకుతో ఊరుమ్మడి కట్టుబాటును అడ్డంపెట్టి మరి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ,ఎస్టీ వర్గాల ఓటర్లకు పంచాచతీ సర్పంచ పదవులు దక్కకుండా గండికొట్టారు.

అధికారుల తప్పిదం ఒక పక్క, అగ్రవర్ణాల గ్రామాధికార పెత్తనం కలగలిసి గ్రామ స్వరాజ్యంలో పాలనాధికారానికి బడుగు, బలహీన వర్గాలను దూరం చేశాయి. గ్రామంలో బడుగు, బలహీన వర్గాల ఓటర్లే లేని చోట ఆ పంచాయతీలను ఆ వర్గాల వారికి రిజర్వు చేయడంలో జరిగిన తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుడ్డిగా జనాభాలెక్కలను ఏమాత్రం పరిశీలించకుండా సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారుల తప్పిదం వల్ల బడుగులు గ్రామ పాలనాధికారాని దూరమైన పంచాచయతీలను పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పెదకడిమి, మర్రిగూడెం పంచాయతీలు, గుంటూరు జిల్లాలో ముత్తాయపాలెం, నెల్లూరు జిల్లాలో రంగనాథపురం, మంగళూరు పంచాయతీలు ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో పెండ్యాల, కొత్త ఈదర, విజయనగరం జిల్లాలో వియ్యంపెట, జోగి పేట , శ్రీకాకుళం జిల్లాలో పొన్నటూరు పంచాయతీలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పెద్దశెట్టిపల్లి, చీపురుపల్లి, ఎన్‌.అగ్రహారం, కుదుకుప్పం, సముదాయం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో చింతగూడ, బండలనాగపూర్‌, గూడెం, వడ్డాడి పంచాయతీలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లాలో నైనాల, డీసీ తాండ, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మందానపల్లి, కరీంనగర్‌ జిల్లాలో దమ్మూరు , నల్గొండ జిల్లాలో వజినేపల్లి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్గొండ జిల్లా పోతునూరు, తెప్పల మడుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కుమ్మరోని పల్లి, మెదక్‌జిల్లాలో చింతపల్లి, కోయ చెకల, వెంకట్‌రెడ్డి పేట, కానాపురం, రాజారాం ఉన్నాయి. ఈ పంచాయతీలు అన్నీ ఎస్సీ,ఎస్టీ జనరల్‌, మహిళా అభ్యర్థులకు రిజర్వు చేసినవే.అంతే కాకుండా వెనుక బడిన వర్గాలకు చెందిన ఓటర్లకు రిజర్వేషన్‌ చేసిన పంచాయతీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.

నల్గొండ జిల్లాలో మోతీరాం తండా, గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్‌ చేయగా అక్కడ ఆవర్గాలకు చెందిన ఓటర్లు లేక పోవడంతో నామినేషన్‌ వేసే అవకాశం లేకుండా పోయింది. రిజర్వేషన్ల ఖరారులో అధికారులు చేసిన తప్పిదాల వల్ల నామినేషన్లు దాఖలు చేయకుండా ఖాళీగ ఉన్న ఈ పంచాయతీలకు రిజర్వేషన్‌ కేటగిరి వర్గాలకు చెందిన ఓటర్లు లేక పోవడంతో ఆ మేరకు ఈ వర్గాల వారికి తిరిగి కొత్త పంచాయతీల్లో రిజర్వేషన్‌ కల్పించే అవకాశం కూడా చేజారిపోయింది. ప్రభుత్వం ఇక నైనా జరిగిన తప్పిదాలను సరిదిద్ది 34 గ్రామ పంచాయతీల్లో బడుగు, బలహీనవర్గాలకు పంచాయతీ పదవులు దక్కే అవకాశం కల్పించాలన్న డిమాండ్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల నుండి వ్యక్త మవుతున్నాయి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి